తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచలోని వైద్య, ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ హాజరయ్యారు. అనంతరం జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఫార్మసిస్టులు ప్రతిజ్ఞ చేసి, కేక్ కట్ చేశారు. ప్రతిభ చూపిన వారిని జిల్లా వైద్యాధికారి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ... భారత దేశంలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మసీ చట్టం 1948, డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం 1940ను రూపొందించిందని, వైద్యుడు రోగాన్ని గుర్తిస్తే, ఫార్మాసిస్ట్ ఆ రోగికి అందే ఔషధం ఇస్తూనే.. ఏ మందు ఎంత మోతాదులో వేసుకోవాలో అవగాహన కల్పిస్తారని తెలిపారు. తెరవెనుక సేవలందించే ఫార్మసిస్టులను గుర్తు చేసుకునేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25 న ప్రపంచ ఫార్మసిస్ట్ ది నోత్సవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సూచించిన మందులను రోగులకు సక్రమంగా అందించడం, మందుల నిల్వలను పర్యవేక్షించడం, గడువు ముగిసిన మందులను గుర్తించడం వంటి అనేక బాధ్యతలను ఫార్మసిస్టులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు, నర్సులతో పాటు ఫార్మసిస్టులు కూడా ఆరోగ్య వ్యవస్థలో ముఖ్యమైన భాగస్వాములని తెలిపారు. వైద్యులు సూచించిన మందులను రోగులకు సరైన మోతాదులో, సరైన సమయంలో అందించడంతో పాటు, మందుల వినియోగంపై అవసరమైన సూచనలు ఇవ్వడంలో ఫార్మసిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ముఖ్యంగా యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సలహా లేకుండా వినియోగించకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మందులను స్వయంగా కొనుగోలు చేసి వినియోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, యాంటీబయాటిక్ నిరోధకత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఆరోగ్యశాఖలోని ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఫార్మసిస్టులు తమ వృత్తి నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకుంటూ, మారుతున్న వైద్య విధానాలు, కొత్త ఔషధాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు.