తెలంగాణ / లిబర్టీ న్యూస్ : పనిభారం తగ్గించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఏఎన్‌ఎంలు భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలు మాట్లాడుతూ ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా ఐహెచ్‌ఐపీ, ఎన్‌సీడీ, 36 రిజిస్టర్లు, నేషనల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. హెచ్‌బీ పరీక్షలు, ఫీల్డ్ వర్క్, డ్రైడే, సమావేశాలతో సమయం సరిపోవడంలేదన్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటర్‌నెట్ రాకపోవడంతో ఇళ్లకు వెళ్లి పని చేస్తున్నామని వాపోయారు. రాత్రి, పగలు పనిచేసినప్పటికి సమయం సరిపోవడం లేదని, తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 32 సంవత్సరాల తమ సర్వీసులో ఆనారోగ్యాలతో బాధపడుతూ విధులు నిర్వహిస్తూ, ఎలాంటి పదోన్నతులు లేకుండా పని చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తాము ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నరాటి ప్రసాద్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.