తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని కుంటినాగులగూడెం లో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా పేదరికం - నిర్మూలన కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ ఎం.రాజేందర్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకువచ్చాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సమాజంలో ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు,చిన్నారులు వృద్ధులు,ప్రకృతి వైపరీత్యాల బాధితులు మూడు లక్షల లోపు సంవత్సర ఆదాయం ఉన్నవారికి లోక్ అదాలత్ ద్వారా న్యాయస్థానాలలో ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని సూచించారు. చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, అందరికీ న్యాయ సేవలు అందించాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. పేదరిక నిర్మూలన పథకాల అమలుపై చట్టపరమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పేదరిక నిర్మూలన కోసం గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2005 సంవత్సరంలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని, దాని ద్వారా గ్రామాలలోనే కూలీలకు ఉపాధి పనులు కల్పిస్తూ వలసలను నివారించడం జరిగిందని,గ్రామీణ స్థాయిలో మహిళ సంఘాల ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా చేయూతను అందించడానికి మహిళా సమైక్య ద్వారా (సెర్ప్) సంఘాలను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాల కోసం బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని ఆడపిల్లలపై వివక్షత చూపకూడదని, బ్రుణహత్యలు, గృహహింస బాలికలపై అఘాయిత్యాలు, కుటుంబ కలహాల సమస్యలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లకు ఎలాంటి ఓటీపీలు వచ్చినా స్పందించకూడదని, లింకులు ఓపెన్ చేయకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తుర్సం దసరాజు, కుర్సం రమేష్, రాము, పారా లీగల్ వాలంటీర్స్ బాడిశ భిక్షం దొర, ముత్తవరపు జానకిరామ్, కేసరి వీరభద్రం, RP నాగమణి, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.