తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కొల్లి కల్పనా చౌదరి ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ (బ్రెస్ట్ క్యాన్సర్)పై విద్యార్ధినీలకు అవగాహన కల్పించారు. అనంతరం హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు చెందిన అంకాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ... విద్యార్ధినీలు, మహిళలు రొమ్ము క్యాన్సర్ (బ్రెస్ట్ క్యాన్సర్)పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్ధినీలు, 30 ఏళ్లు నిండిన మహిళలు రొమ్ము క్యాన్సర్ పరీక్షలను చేయించుకోవాలన్నారు. ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా ఆ వ్యాధిని నివారించుకునే అవకాశం ఉందన్నారు. రొమ్ము క్యాన్సర్ కొందరికే వస్తుందనే అపోహ ఉందని, ఎవరికైనా ఆవ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేసే రొమ్ము క్యాన్సర్ టెస్టులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఆ కుటుంబంలోని మహిళలు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలన్నారు. రొమ్ముక్యాన్సర్‌కు ఐదు రకాల చికిత్సలు ఉన్నాయని, సరైన క్రమంలో టెస్టులు, మందులు వాడితే క్యాన్సర్ తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ ను నిర్మూలించడానికి HPV వ్యాక్సిన్ 8 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వయస్సు గల ఆడపిల్లలకు రెండు డోసులు వేసుకోవాలని తెలిపారు. శరీరం లో ఏ మార్పులు వచ్చిన వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్పనా చౌదరి, కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ, జగదీష్, హాస్పిటల్ ఏజీఎం లక్ష్మయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, డాక్టర్ విజయలక్ష్మి (గైనకాలజిస్ట్), పాల్వంచ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మీప్రసన్న, కనగాల అనంత రాములు, ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ రూప్లా నాయక్, వాలంటీర్లు రమేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.