తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజు దొర అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా డాక్టర్ సోమరాజు దొర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాతలను, దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహనీయులను గుర్తు చేసుకోవాలన్నారు. అనంతరం బ్రేకింగ్ వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తున్న లిబర్టీ న్యూస్ చైర్మన్ రామ్మోహన్ గౌడ్ తో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ముత్యాల శేఖర్, భీమన్న తదితరులు పాల్గొన్నారు.