తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ఇటీవల ఎరుకల హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వలిగి ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా ఎరుకుల ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ గరికె శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గరికె శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.... భారతదేశంలో ఎరుకల జాతి సంక్షేమం కోసం వలిగి ప్రభాకర్ ఎంతగానో కృషి చేశారని, ఎరుకల జాతికి తన జీవితాన్నే అంకితం చేశారని తెలిపారు. ఈ భూమిపై పుట్టిన మొట్టమొదటి ఆదివాసి ఎరుకల బిడ్డల వారసులమని, భూమి పుత్రులమని, సకల సంపదలకు వారసులమని తెలిపారు. భారతదేశంలో క్రీస్తు శకం 2వ శతాబ్ద కాలంలో అమరావతిలో నిర్మించిన బౌద్ధ స్తూపంపై ఎరుకల ముత్తు రాజు పేరు ఉందని, అప్పట్లోనే ఎరుకల వంశస్థులు పరిపాలన సాగించారని తెలిపారు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో కడప జిల్లా, కమలాపురం తాలూకా చెన్నకేశవ స్వామి ఆలయంలో తొలి తెలుగు శిలాశాసనంపై ఎరుకల ముత్తురాజు పేరు ఉండటం గర్వకారణం అని అన్నారు. క్రీస్తు శకం 10వ శతాబ్ద కాలంలో కాకతీయ రాజ్య నిర్మాతలు బేతరాజు ఎరుకల అని శిలా శాసనాలు తెలుపుతున్నాయని అన్నారు. 1871 లో బ్రిటిష్ అధికారి స్టీఫెన్ అనే వ్యక్తి ఎరుకుల కులస్తులను తీవ్రంగా హింసించారని మండిపడ్డారు. కాకతీయుల కాలంలో ఎరుకల రాజులు నాణేలపై పంది ముద్రికలను ముద్రించారని తెలిపారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఎరుకుల కులస్తులు అడవులను జీవనాధారం చేసుకొని, మొట్టమొదటి ఆదివాసీలుగా భూమిపై పుట్టి, సమాజానికి నాగరికత నేర్పిన ఏకైక కులం ఎరుకల కులం అని తెలిపారు. అడవులలో లభించే ఆయుర్వేద మొక్కలు, గడ్డలు మొదలగునవి ఉపయోగించి వారు ఆరోగ్యంగా జీవించటానికి మార్గం చూపిన మొట్టమొదటి శాస్త్రవేత్తలు, వైద్యులు ఆదివాసి ఎరుకల జాతి వారేనని డాక్టర్ గరికె శ్రీనివాస్ ఘంటాపథంగా తెలిపారు. భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎస్సీ ,ఎస్టీ హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారని, వారి అడుగుజాడల్లోనే నడుస్తూ... ఎరుకల జాతి సంక్షేమానికి కట్టుబడి, వారి అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తానని డాక్టర్ గరికే శ్రీనివాస్ తెలిపారు. భారతదేశంలోని ఎరుకల జాతి ఉద్యోగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువజనులు, ప్రజలందరూ ఒకే తాటిపై నిలబడి ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో ముందుండాలని పిలుపునిచ్చారు. డాక్టర్ గరికె శ్రీనివాస్ ఎన్నిక పట్ల స్థానికులు గరికె నాగమణి, వసంత తిరుపతి రావు, వసంత శివ కృష్ణ, ఆర్టీసీ గరికె శ్రీనివాస్, ఎర్రబడి శ్రీను, కల్లోజి రామారావు, ఎర్రబడి డేవిడ్, గరికె యాదగిరి, గరికె రవితేజ, ఉత్తేజ్, కిరణ్, పవన్, నవీన్, ప్రకాష్, గరికె రాంబాబు, గరికె వెంకన్న, అనుబ్రోలు రాంబాబు, ఇంజం సాయి, మూకర లాజర్, మొగిలి కృష్ణయ్య, మూకర రాంబాబు, జగన్నాధం నారాయణ, పొన్న నాగేశ్వర రావు, పొన్న వెంకటేశ్వర్లు, మేడ చంటి, మొగిలి నరేష్, గరికె వెంకటరమణ, నరసింహారావు, రాయగిరి మల్లేశ్వర రావు, రసపుత్ర నారాయణ, కాసాని మణి సాయి మహీధర్, కాకటి రామయ్య, శెట్టిపల్లి రమేష్, శెట్టిపల్లి శ్రీను, గండమాల రాజు, కల్లోజి కార్తీక్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.