తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు తమ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాస్తున్నారు. పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు ఉన్నారని, ఇంకొక టీచర్, విద్యా వాలంటీర్లను నియమించాలని, ప్రభుత్వం తరుపున పారిశుద్ధ్య కార్మికుడిని నియమించాలని, తరగతి గదుల్లో సరైన నల్ల బల్లలనుఏర్పాటు చేయాలని, గురుకులాల్లో మాదిరిగానే నోటు పుస్తకాలు, బ్యాగులు, బూట్లు పోషకాలతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కోరుతూ ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు, డిస్ట్రిక్ట్ ఎన్నారై పౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి తుక్కాని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలపై దృష్టిని సారించాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై విజ్ఞాపన కార్యక్రమం ని పోస్ట్ కార్డుల ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు.