తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసానికి కేసీఆర్ వెళ్లారు. ఆయనకు ముందుగా వనమా రాఘవేంద్రరావు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం తేనెటీ విందును స్వీకరించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ వనమా రాఘవ గో హెడ్... ఎన్నికల్లో చురుగ్గా పనిచేయాలి... మీ వెనుక నేనున్న... అంటూ వనమా రాఘవ భుజం తట్టి కేసీఆర్ అభయమిచ్చారు. ఎన్నికల అనంతరం కుటుంబ సమేతంగా హైదరాబాదులోని తమ ఇంటికి భోజనానికి రావాలని వనమా కుటుంబ సభ్యులను కేసీఆర్ ఆహ్వానించారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో పాత పాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ ఇష్యూ తెరపైకి వచ్చింది. నలుగురు కుటుంబ సభ్యులు అగ్నికి ఆహుతైన ఘటన మరువక ముందే కేసీఆర్ వనమా రాఘవను భుజం తట్టి నేనున్నానని అనటంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ - వనమా రాఘవ కలయిక ఖమ్మం BRS ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పై ఎఫెక్ట్ పడవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.