తెలంగాణ / లిబర్టీ న్యూస్ : కొత్తగూడెం పట్టణంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.128.48కోట్లు, విద్యానగర్ కాలనీలో డ్రైన్ల నిర్మాణానికి రూ.4కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రులతో శంకుస్థాపన చేసుకున్న అనతికాలంలో ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి రూ.450 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఇతర అభివృద్ధి పనులకు మరో రూ.72.86 కోట్ల మంజూరు లభించిందని, ఇది కొత్తగూడెం నియోజకవర్గ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు అనిశెట్టిపల్లి జాతీయ రహదారి 930P నుంచి పాల్వంచ వరకు, సర్వారం, రామవరం, జగన్నాధపురం మీదుగా 30వ జాతీయ రహదారిని కలుపుతూ 25 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు రహదారి నిర్మాణానికి రూ.450కోట్లు మంజూరయ్యాయని, ఈ రహదారి నిర్మాణంతో జంట పట్టణాలకు ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరనుందని అన్నారు. భద్రాచలం పట్టణం వద్ద విజయవాడ-జగ్దల్పూర్ 30వ జాతీయ రహదారిని సుమారు 7 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఎదురుగా పాదచారులు దాటుటకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.64కోట్ల మంజూరు లభించిందని, అదేవిధంగా విజయవాడ-జగ్దల్పూర్ 30వ జాతీయ రహదారిలో కిన్నెరసాని నదిపై వంతెన నిర్మాణానికి రూ.20.22 కోట్లకు మంజూరు లభించిందని తెలిపారు. మంజూరైన పనులు పూర్తయితే కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు నగరాలకు ధీటుగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. గడిచిన ఏడునెలల్లోనే కొత్తగూడెం నియోజకవర్గానికి వివిధ పథకాల రూపంలో కోట్లాది రూపాయల నిధుల వర్షం కురిసింది, ఇదే స్పూర్తితో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు శాశ్వత పరిస్కారం లభించే విధంగా శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ఎమ్మెల్యే కూనంనేని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మంత్రివర్గం సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తోందని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో సిపిఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఎస్కే. సాబీర్ పాషా, అన్నవరపు కనకయ్య, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, కొండా వెంకన్న, టిడిపి జిల్లా నాయకులు నల్లమల వేణు, శరత్, సిపిఐ జిల్లా నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, వీసంశెట్టి పూర్ణచందర్ రావు, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, జక్కుల రాములు, నూనావత్ గోవిందు, యూసుఫ్, నేరెళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.