తెలంగాణ / లిబర్టీ న్యూస్ : కన్న తల్లిదండ్రులు.. పురిటిగడ్డ.. తనకు విద్యాబుద్ధులు నేర్పిన బడులను మరువకుండా సేవలు అందించే వారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. అందుకోసం ఎంతోమంది తమ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు పుట్టిన గడ్డకు సేవలు అందిస్తూ, తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం కు చెందిన బూరుగుపల్లి ప్రసాదరావు తాను చదువుకున్న సీతారాంపట్నం ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులకు గురువారం తన వంతు సహాయంగా 20,000/- రూపాయల చెక్కు తో పాటు మరో 20 వేల రూపాయల మెటీరియల్ ను అందిస్తానని తెలిపారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మునుముందు మరింత సహాయ సహకారాలు అందజేస్తానని బూరుగుపల్లి ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుధాశ్రీ, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి బూరుగుపల్లి ప్రసాదరావును ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్లమల సత్యనారాయణ, నరసింహారావు, సుధాకర్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.