తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్ పటేల్ కు చెందిన నటరాజ్ సెంటర్ లోని రియల్ ఎస్టేట్ కార్యాలయంలో కడలి సత్యనారాయణ పనిచేస్తున్నాడు. రోజులాగే తన పనులు ముగించుకొని బుధవారం సత్యనారాయణ ఇంటికి వెళుతున్న క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కాంపెల్లి కనకేష్ పటేల్, చింతా నాగరాజు సత్యనారాయణకు సిపిఆర్ చేశారు. కాసేపటికి సత్యనారాయణ స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కాంపెల్లి కనకేష్ పటేల్ ను, చింత నాగరాజును పాల్వంచ ప్రజలు అభినందిస్తున్నారు.