తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగు కు చెందిన గుగులోతు నాగరాజు నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి పక్కనే ఉన్న ఇంటి నుండి వాటర్ క్యూరింగ్ చేస్తున్నాడు. అన్నపురెడ్డిపల్లిలో లైన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ... ఇటీవల బదిలీపై పాల్వంచ టౌన్ -1 లైన్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జినుగు నాగరాజు కరకవాగులోని నూతన ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి, ఇంటికి కరెంటు మీటర్ లేదని, దొంగ కరెంటు వాడుతున్నందుకు కరెంటు కేసు అవుతుందని 68,000/- డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వటం ఇష్టంలేని గుగులోతు నాగరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం ఉదయం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లైన్ ఇన్స్పెక్టర్ జినుగు నాగరాజు 26,000/- లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 కు సమాచారం అందించాలని తెలిపారు.