తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ కేంద్రంతో పాటు, మండలంలోని పలు గ్రామాలకు పట్ట పగలే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నది. సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అక్రమార్కులు అదును చూసి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని వాగు నుండి రంగాపురం, నాగారం, పరిసర గ్రామాల నుండి మొదలుకొని, పాల్వంచ పట్టణంలోని మొర్రేడు వాగు నుండి కుంటినాగులగూడెం, పేటచెరువు, జగ్గుతండా, ఎర్రగుంట ప్రాంతాల నుండి ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా కుంటినాగులగూడెం ప్రాంతంలో జాతీయ రహదారి పక్కనే భారీగా ఇసుక నిల్వలు చేసుకొని టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఓ కారులో ఇసుక వ్యాపారులు సంచరిస్తూ.. ఇసుక వాహనాలను ఆపిన అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. స్థానిక అధికారుల అండదండలతోనే భారీగా ఇసుక నిల్వలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ఇసుక నిల్వలు ఉన్నా ... పోలీస్, రెవిన్యూ, ఫారెస్ట్ అధికారులు ఇటువైపు చూడకపోవటంతో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నెంబరు ప్లేటు లేని వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక వ్యాపారం లాభసాటిగా మారడంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా రోజుకు పదుల సంఖ్యలో ఇసుక వాహనాలు వెళ్తున్నాయి. ఇసుకను తరలిస్తున్న వాహనాలను ఎక్కువగా మైనర్లే నడుపుతున్నారు. ఇసుక వాహనాలను డ్రైవర్లు అతివేగంగా నడపడం వల్ల ఇతర వాహనదారులు, పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓవర్ స్పీడ్‌తో వస్తున్న ఇసుక వాహనాలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను మైనర్లు డ్రైవింగ్ చేస్తున్న పట్టించుకునే నాథుడేలేడని ప్రజలు వాపోతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే రెవెన్యూ, పోలీసు, ఫారెస్ట్ శాఖ అధికారులు తనిఖీలు చేసి ఇసుక వాహనాలను స్వాధీనం చేసుకుని నామమాత్రపు జరిమానాలు విధిస్తూ వదిలేస్తున్నారని, అధికారులు స్పందించి భారీ ఇసుక నిల్వలను, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.